ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి...
- విద్యార్థులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది: గువ్వల బాలరాజు
వనపర్తి, ఆగష్టు 21( రైజింగ్ సన్ న్యూస్): పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ సమీపంలో ధర్నా నిర్వహించారు. జిల్లా యువమోర్చా అధ్యక్షుడు అరవింద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అధ్యక్షత వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, పలువురు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతోందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యార్థులను
అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని గువ్వల బాలరాజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి, సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ధర్నాలో బీజేపీ నాయకులు అందే బాబయ్య, సబిరెడ్డి వెంకట్రెడ్డి, లోకనాథ్రెడ్డి, మంటంపల్లి పురుషోత్తంరెడ్డి, రామన్నగారి వెంకటేశ్వరరెడ్డి, పెద్దిరాజు, శ్రీనివాస్గౌడ్, కల్పన, గజరాజుల తిరుమలేష్, విజయ్, నక్క మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ టీచర్ల ఆందోళనకు బీజేపీ సంఘీభావం...
ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రైవేట్ టీచర్లు చేపట్టిన ఆందోళనకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ, మాజీ జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులకు మద్దతు ప్రకటించారు.రూపారెడ్డి హత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. న్యాయం జరిగే వరకు ప్రైవేట్ టీచర్ల పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు.
0 Comments