కొడంగల్కో న్యాయం.. వనపర్తికో న్యాయమా?
- భూనిర్వాసితులకు ఎకరాకు ₹25 లక్షల పరిహారం ఇవ్వాలి
బుద్ధారం బాధితుల దీక్షకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంఘీభావం
రైజింగ్ సన్ న్యూస్ గోపాల్పేట, అక్టోబరు 10:
ఎన్నికల హామీలను విస్మరించి భూ నిర్వాసితుల కడుపు కొట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని, కొడంగల్ నిర్వాసితులకు ఒక రకమైన పరిహారం.. వనపర్తి ప్రజలకు మరొక రకమైన పరిహారమా అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిలదీశారు. గోపాల్ పేట మండలం బుద్ధారం గ్రామ పెద్ద చెరువు భూ నిర్వాసితులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి తమ సంపూర్ణ సంఘీభావం తెలిపారు. నిర్వాసితుల న్యాయమైన పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రగల్భాలు పలికి.. ఇప్పుడు మాట మారుస్తారా?
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం ఎకరాకు ₹25 లక్షల పరిహారం ఇప్పిస్తానని, లేకపోతే 20 అడుగుల గోతిలో నన్ను బొంద పెట్టండని ప్రగల్భాలు పలికిన నాయకులు.. నేడు మూడేళ్ల తర్వాత మళ్లీ పాత ధర ₹12 లక్షలే ఇస్తామనడం సిగ్గుచేటు" అని దుయ్యబట్టారు. ఇచ్చే మాటపై కాంగ్రెస్ నాయకులు కట్టుబడాలని స్పష్టం చేశారు.
నిర్వాసితుల పరిహారం వివరాలు ఇలా:
- మొత్తం ముంపు భూమి: 210 ఎకరాలు (పాత ముంపు 110 ఎకరాలు + కొత్తగా రిజర్వాయర్లో భాగమైనవి 101 ఎకరాలు).
- గత బిఆర్ఎస్ ప్రతిపాదన: చట్టపరిధిలో ఎకరాకు ₹12 లక్షల పరిహారంతో పాటు దళితులకు దళిత బంధు, బిసిలకు బిసి బంధు మరియు మిగతా కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.
- ప్రస్తుత డిమాండ్: కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప్రకారం ఎకరాకు ₹25 లక్షల నష్టపరిహారం తక్షణమే చెల్లించాలి. ప్రత్యామ్నాయంగా 1:3 నిష్పత్తిలో భూమి ఇవ్వాలి.
- పోలికపాడు శివారులో ప్రభుత్వానికి చెందిన వ్యవసాయేతర భూమి అందుబాటులో ఉందని నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు. ఒకవేళ ₹25 లక్షల నగదు పరిహారం ఇవ్వలేని పక్షంలో, నిర్వాసితులకు ఎకరా భూమికి బదులుగా మూడు ఎకరాల (1:3 నిష్పత్తి) భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయి రోడ్డున పడుతున్న రైతులకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామని, సమస్య పరిష్కారానికి ముందుండి పోరాడుతామని ఆయన బాధితులకు భరోసానిచ్చారు.

0 Comments