ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ అరికట్టాలి
ఎంఈఓకు సీపీఎం వినతిపత్రం.. నిబంధనలు అమలు చేయాలని డిమాండ్
పెబ్బేరు, జూలై 13,రైజింగ్ సన్ న్యూస్:పెబ్బేరు మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టి ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.సోమవారం సీపీఎం పెబ్బేరు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి (ఎంఈఓ) జయరాములకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రైవేట్ విద్యాసంస్థలపై నిర్వహించిన సర్వేలో గుర్తించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మండ్ల రాజు, మండల కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ జి. బాలయ్య మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఒకటి నుంచి మూడో తరగతి వరకు రూ.21 వేల వరకు, నాలుగు, ఐదో తరగతులకు రూ.30 వేల వరకు, పై తరగతులకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, ఇతర విద్యా సామగ్రి పేరుతో కూడా తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు. పాఠశాల యాజమాన్యాలు యూనిఫారాల విక్రయాన్ని సైతం వ్యాపారంగా మార్చి అధిక మొత్తాలు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.నిబంధనల ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రతి తరగతికి నిర్ణయించిన ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని, అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాల నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై సంబంధిత అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని, లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఆర్. భాస్కర్, ఎం. వెంకటస్వామి, పి. ఊసన్న, జి. మన్యం తదితరులు పాల్గొన్నారు.
0 Comments