రూ.573 కోట్లతో హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన
ప్రజలకు సురక్షిత రవాణా కల్పించడమే లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మక్తల్ నియోజకవర్గంలో రూ.573.28 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హ్యామ్ రహదారి అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా రూ.237 కోట్లతో నిర్మించనున్న మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 12–16 నెలల్లో మక్తల్–నారాయణపేట రహదారిని పూర్తి చేసి ప్రయాణ సమయాన్ని 20 నిమిషాలకు తగ్గిస్తామని తెలిపారు. నాణ్యమైన రహదారులే పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధికి పునాది అని పేర్కొన్నారు.మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రహదారుల అభివృద్ధితోనే ప్రాంతీయ ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. మంత్రి వాకిటి శ్రీహరి కృషితో మక్తల్ నియోజకవర్గానికి భారీ రహదారి ప్రాజెక్టులు మంజూరయ్యాయని కొనియాడారు.మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మక్తల్–నారాయణపేట రహదారి నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్, మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
0 Comments