Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలి... - ఎల్ నినో ప్రభావంతో తగ్గిన వర్షపాతం - సాగునీటి లభ్యత ఆధారంగానే ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల - మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి - వనపర్తిలో ఉమ్మడి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం

 ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలి...

- ఎల్ నినో ప్రభావంతో తగ్గిన వర్షపాతం

- సాగునీటి లభ్యత ఆధారంగానే ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల

- మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి

- వనపర్తిలో ఉమ్మడి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం


వనపర్తి, ఆగస్టు 13( రైజింగ్ సన్ న్యూస్): ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు వరి సాగు జోలికి వెళ్లకుండా ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. బుధవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన నిర్వహింఛిన సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో మంత్రి జూపల్లితో పాటు రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్, వ్యవసాయ శాఖల అధికారులతో కలిసి సాగునీటి లభ్యత, తాగునీటి అవసరాలపై సమీక్ష నిర్వహించారు.

ఎగువ ప్రవాహాలపైనే ఆధారపడక తప్పదు..


కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల జూరాల ప్రాజెక్టుకు కొంత వరద నీరు రావడం ఊరటనిచ్చిందని, అయితే డిసెంబరు వరకు పంటలకు నీరు అందాలంటే వర్షాలు కురవడం అత్యవసరమని మంత్రి జూపల్లి తెలిపారు. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల జరిగితేనే మన ప్రాజెక్టుల ద్వారా రైతులకు నీటిని అందించే అవకాశం ఉంటుందన్నారు. ఇన్​ఫ్లో తగ్గితే 'ఆన్ అండ్ ఆఫ్' పద్ధతిలో నీరు విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. ప్రత్యామ్నాయంగా మినుము, వేరుశనగ, ఆయిల్ పామ్, కూరగాయలు వంటి ఆరుతడి పంటలను సాగుచేసేలా వ్యవసాయ అధికారులు రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలి..

జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఎంత నీటి నిల్వ ఉంది, ఎంత విడుదల చేస్తున్నారనే వాస్తవ సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో వాస్తవ పరిస్థితులను వివరిస్తూ అధికారులంతా జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు.

సమావేశంలో మాట్లాడిన శాసనసభ్యులు:

తూడి మేఘారెడ్డి (వనపర్తి): కేఎల్ఐ ద్వారా శ్రీశైలం నీటిని అందించే మార్గాలను చూడాలని, పాలమూరు-రంగారెడ్డి ద్వారా రిజర్వాయర్లు నింపి, శంకర సముద్రానికి నీరు విడుదల చేయాలని కోరారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల): జూరాల, నెట్టెంపాడు కుడి కాలువ ద్వారా వారానికి మూడు రోజుల చొప్పున 'ఆన్ అండ్ ఆఫ్' పద్ధతిలో నీటిని ఇవ్వాలని సూచించారు.

జి.మధుసూదన్ రెడ్డి (దేవరకద్ర): బోర్లు రీఛార్జ్ అవ్వడానికైనా ఆన్ అండ్ ఆఫ్ విధానం ఉపయోగపడుతుందని, పాడైన మోటార్లకు మరమ్మతులు చేయించి కోయిల్ సాగర్‌కు నీటిని విడుదల చేయాలన్నారు.

చిక్కుడు వంశీకృష్ణ (అచ్చంపేట): ప్రాజెక్టుల నీటి విడుదలపై రైతులకు స్పష్టమైన సమాచారం ఇస్తూనే, ఇప్పటికే వరి వేసుకున్న రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతులను చైతన్యపరచాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి


కాలువలకు ఒక్కసారి నీరు విడుదల చేయగానే రైతులు వరి నాట్లకు సిద్ధమవుతారని, నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తగా ఆరుతడి పంటలు వేసుకునేలా వ్యవసాయ అధికారులు రైతులను చైతన్యపరచాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో నాగర్​కర్నూల్, అలంపూర్ ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, విజయుడు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మహబూబ్​నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్​కర్నూల్ జిల్లాల కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, సీహెచ్ ప్రియాంక, షేక్ రిజ్వాన్ బాషా, హిమంత కేశవ్ పాటిల్, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, ఇరిగేషన్, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి