Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా రైతు, కార్మికుల గళం” వనపర్తిలో భారీ ర్యాలీ.. రాస్తారోకో.. నాయకుల అరెస్టు, విడుదల

కార్పొరేట్లకు అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ రైతు, కార్మికుల జైలుభరో..




వనపర్తిలో రాస్తారోకో.. పలువురు కార్మిక సంఘాల నేతల అరెస్టు

వనపర్తి, ఆగస్టు 10 (రైజింగ్ సన్ న్యూస్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ రైతులు, కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తోందని ఆరోపిస్తూ రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. వేలాది మంది కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి వివిధ కార్మిక, రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.అరెస్టు చేసిన కార్మిక సంఘాల నాయకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద సంఖ్యలో కార్మికులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులు సొంత పూచీకత్తుపై నాయకులను విడుదల చేశారు. 



ప్రధాన డిమాండ్లు

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అన్ని పంటలకు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం సి2+50 శాతం ఫార్ములాతో కనీస మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేసి కార్మికులందరికీ నెలకు రూ.31 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి ఏడాదికి 200 రోజుల పని, రోజుకు రూ.700 వేతనం కల్పించాలని కోరారు. సార్వత్రిక సామాజిక భద్రత పింఛన్‌ను నెలకు రూ.10 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. అమెరికాతో సహా రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఉపసంహరించుకోవాలని, ప్రతిపాదిత విత్తన బిల్లు-2025, విద్యుత్‌ ప్రైవేటీకరణ బిల్లు-2025, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ సవరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రీ-పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును నిలిపివేయాలని కోరారు. ఎఫ్‌సీఐని బలోపేతం చేయడంతోపాటు ఆహార ధాన్యాల నిల్వ, కొనుగోలు వ్యవస్థను కార్పొరేట్‌ గుత్తాధిపత్యానికి అప్పగించరాదన్నారు. వ్యవసాయం, ఆహార శుద్ధి, ఆహార ఎగుమతులు, వ్యూహాత్మక ఎంఎస్‌ఎంఈ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించరాదని కోరారు. రైతులకు సమగ్ర రుణమాఫీ ప్రకటించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. బలవంతపు భూసేకరణను అడ్డుకోవాలని, భూసేకరణ చట్టం-2013, అటవీ హక్కుల చట్టం-2006, పీసా చట్టం-1996 ప్రకారం రైతులు, గిరిజనుల భూ హక్కులను పరిరక్షించాలని కోరారు. ఎరువులు, ఇంధనం, వంటగ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలను నియంత్రించి సబ్సిడీలను పునరుద్ధరించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రైతులకు పంటల, పశువుల బీమా కల్పించాలని డిమాండ్‌ చేశారు. వాటర్‌షెడ్ల అభివృద్ధితో ప్రతి పొలానికి నీటి సౌకర్యం కల్పించాలని, వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో పారదర్శకంగా సహాయం అందించేందుకు తగిన నిధులు కేటాయించాలని కోరారు.విద్యకు జీడీపీలో ఆరు శాతం, పరిశోధన, అభివృద్ధి రంగానికి కేంద్ర బడ్జెట్‌లో ఆరు శాతం, జీడీపీలో మూడు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

నాయకుల పాల్గొనడం 

ఆందోళనలో AITUC జిల్లా కార్యదర్శి మోషా, ఉపాధ్యక్షుడు గోపాలకృష్ణ, CITU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.ఎన్‌. రమేష్‌, మండ్ల రాజు, TUCI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుర్మయ్య, అరుణ్‌కుమార్‌, ఏఐకేఎస్‌ జిల్లా కార్యదర్శి రాబర్ట్‌, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేష్‌ ఆచారి, ఉపాధ్యక్షుడు జి.ఎస్‌. గోపి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.అజయ్‌, మేకల ఆంజనేయులు, తెలంగాణ ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజన్న, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్‌, ఐద్వా నాయకులు సాయిలీల, లక్ష్మి, డీహెచ్‌పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మహేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ తదితరులు ఆందోళనకు మద్దతు తెలిపారు. వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి