ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు
అర్జీల స్థితిని ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా తెలియజేయాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి
ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి, వాటి స్థితిని సంబంధిత ఫిర్యాదుదారులకు తెలియజేయడంతో పాటు ఆన్లైన్లోనూ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఎన్. ఖీమ్యా నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్లతో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతిపత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఫిర్యాదు తమ శాఖ పరిధిలో లేకపోతే సంబంధిత శాఖకు వెంటనే పంపించి, ఆ విషయాన్ని ఫిర్యాదుదారునికి తెలియజేయాలని సూచించారు. పరిష్కరించలేని అంశాలైతే సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించడం లేదా నిబంధనల ప్రకారం ఎందుకు పరిష్కరించలేమో లిఖితపూర్వకంగా వివరించాలని, దరఖాస్తులను పెండింగ్లో ఉంచవద్దని ఆదేశించారు.
పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం, జిల్లా మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రజావాణి దరఖాస్తులను కూడా అత్యంత ప్రాధాన్యంతో సత్వరమే పరిష్కరించాలని సూచించారు.
ఈ వారపు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కేంద్రంలో మొత్తం 60 దరఖాస్తులు, ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 9 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో యాదయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్. తిరుపతయ్య, శిక్షణ ఉప కలెక్టర్లు శ్రావ్య, రజనీకాంత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
0 Comments