ఆదిలాబాద్, బోథ్:
జిల్లాలో అవినీతి వ్యతిరేక దళం (ACB) మరోసారి పంజా విసిరింది. బోథ్ ఫారెస్టు రేంజ్లో లంచం తీసుకుంటూ ఫారెస్టు రేంజ్ అధికారి (FRO), జూనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కారు.
లంచం డిమాండ్ – రూ.15 వేలు
హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన చెక్డ్యాం పనులకు సంబంధించిన బిల్లులు సుమారు రూ.5 లక్షలు పెండింగ్లో ఉండగా, బాధితుడు వాటి విడుదల కోసం అధికారులను పలుమార్లు సంప్రదించాడు.
ఈ క్రమంలో ఫారెస్టు రేంజ్ అధికారి టి. ప్రణయ్ బిల్లుల క్లియరెన్స్ కోసం రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఏసీబీ ఉచ్చు
లంచం ఇవ్వాలని ఒత్తిడి పెరగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు జూనియర్ అసిస్టెంట్ పరుశురాంకు రూ.15 వేలు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అధికారుల అంగీకారం
విచారణలో జూనియర్ అసిస్టెంట్ పరుశురాం, ఫారెస్టు రేంజ్ అధికారి ఆదేశాల మేరకే డబ్బు తీసుకున్నట్లు అంగీకరించినట్లు ఏసీబీ వెల్లడించింది.
కేసు నమోదు – కోర్టుకు హాజరు
ఇద్దరు అధికారులను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ, కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచింది. తదుపరి విచారణ కొనసాగుతోంది.

0 Comments