ఫ్యూచర్ సిటీపై మోజు.. పాలమూరు రైతులపై నిర్లక్ష్యమా?
- సాగునీటి సమస్యపై సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీసిన నిరంజన్‌రెడ్డి
- జూరాలలో నీరున్నా పంటలకు విడుదల చేయరా? రైతులపై కేసులు బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్
రైజింగ్ సన్ న్యూస్ , ఆత్మకూరు అక్టోబర్ 9 : ఫ్యూచర్ సిటీపై చూపుతున్న శ్రద్ధ పాలమూరు రైతుల సమస్యల పరిష్కారంపై ఎందుకు లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పంటలు దిగుబడికి వచ్చిన సమయంలో సాగునీరు విడుదల చేయాలని కోరిన రైతులపై కేసులు నమోదు చేయడం, అరెస్టులతో వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆత్మకూరులో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, దిగుబడికి వచ్చిన పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేయాలని కోరిన రైతులపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు.
నీళ్లు అడిగితే కేసులా?
అన్నం పెట్టే రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు సాగునీరు కోరితే, వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కేసులతో భయపెట్టడం ఏమిటని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. రైతులపై ప్రజా ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం (పీడీపీపీ) కింద కేసు నమోదు చేయడాన్ని ప్రభుత్వ అణచివేత ధోరణిగా అభివర్ణించారు. కేసులను ఎత్తివేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
సలహాలు ఇచ్చినా స్పందించలేదు
సాగునీటి సమస్య పరిష్కారానికి కార్యాచరణపై తమ అనుభవంతో సలహాలు ఇచ్చామని, అధికారులతోనూ మాట్లాడామని నిరంజన్‌రెడ్డి తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులు ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. సమస్యను పరిష్కరించకుండా రైతులనే నిందితులుగా చూడటం సరికాదని పేర్కొన్నారు.
పాలమూరు రైతుల పక్షాన పోరాటం
పాలమూరు ప్రాంతానికి చెందినవాడినని చెప్పుకునే ముఖ్యమంత్రి, ఇక్కడి రైతుల సాగునీటి సమస్యలపై దృష్టి సారించాలని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతులపై నమోదు చేసిన కేసులను బేషరతుగా ఎత్తివేసి, పంటలను కాపాడేందుకు అవసరమైన సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
.png)
0 Comments