57 గ్రామపంచాయతీలకు ‘టీబీ ముక్త’ ప్రశంసాపత్రాలు
కలెక్టర్, డీఎంహెచ్ఓ చేతులమీదుగా అందజేత
వనపర్తి, రైజింగ్ సన్ న్యూస్ అక్టోబర్ 8 : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘టీబీ ముక్త భారత్’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు విశేష కృషి చేసిన 57 గ్రామపంచాయతీలకు గురువారం ప్రశంసాపత్రాలను అందజేశారు. వనపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ)లతో కలసి సర్పంచులు, వైద్య సిబ్బందికి ఈ పురస్కారాలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 57 పంచాయతీలు ‘టీబీ ముక్త’ గ్రామాలుగా గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు, గ్రామస్థాయి ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో సాగించిన సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలోని మిగతా గ్రామపంచాయతీలు కూడా ముందుకు సాగి టీబీ రహితంగా మారాలని పిలుపునిచ్చారు. వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి, పరీక్షలు నిర్వహించి బాధితులకు పూర్తిస్థాయిలో ఉచిత వైద్య సేవలు అందించడం ద్వారా క్షయ వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించారు.జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధిపై అవగాహన పెంచుతూ, అనుమానితులకు సకాలంలో పరీక్షలు చేయించడంలో ఎంపీడీవోలు, సర్పంచులు, వైద్య అధికారులు, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు కీలకంగా వ్యవహరించారని ప్రశంసించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఈ 57 గ్రామాలు మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచాయని, జిల్లాను పూర్తిగా టీబీ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. అనంతరం ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు, ఆరోగ్య కార్యకర్తలను శాలువాలతో సత్కరించి అభినందన పత్రాలు అందజేశారు.

0 Comments