రైతులపై కేసులు ఉపసంహరించుకోవాలి
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్ డిమాండ్
వనపర్తి , రైజింగ్ సన్ న్యూస్ అక్టోబర్ 8 : జూరాల ప్రాజెక్టు వద్ద సాగునీటి కోసం ఆందోళన చేపట్టిన రైతులపై ప్రభుత్వం నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. గురువారం వనపర్తిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాల్పనిక వాగ్దానాలతో మంత్రులు నీళ్లు విడుదల చేయడంతో, రైతులు భారీగా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. ఆ తర్వాత నీటి సరఫరా నిలిపివేయడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని, వేసవిలో తాగునీటి ఎద్దడి నెపంతో సాగునీటిని బంద్ చేయడం దారుణమన్నారు. పంటలను కాపాడుకునే ఆవేదనతోనే కొందరు రైతులు కాలువ గేట్లు ఎత్తే ప్రయత్నం చేశారని, వారేమీ దేశద్రోహులు కారని స్పష్టం చేశారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలపై కేసులు పెట్టడం సరికాదని, వెంటనే వాటిని ఎత్తివేయాలని కోరారు. ప్రస్తుతం వరి పంటలు పొట్ట, ఈనె దశలో ఉన్నాయని.. మరో నెల రోజుల పాటు సాగునీరు అందిస్తే పంటలు చేతికి వస్తాయని వివరించారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి 3 టీఎంసీల నీటిని సాధించామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో నీటి జాడ లేదన్నారు. జూరాల కాలువ ద్వారా రామన్ పాడు జలాశయానికి చేరే నీటిని లిఫ్ట్ ద్వారా కొత్తకోట, వనపర్తి, శ్రీరంగాపూర్ మండలాలకు అందించాల్సి ఉందని, నీరు రాక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎగువ ప్రాంతం నుంచి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, నాయకుడు శివకుమార్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పృథ్వీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments