ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా ఇండియా కూటమి సమరభేరి!-

జ్ఞానేశ్వర్ కుమార్ను పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలి: డీసీసీ చీఫ్ శివసేన రెడ్డి డిమాండ్
- నియోజకవర్గంలో 45 వేల ఓట్ల తొలగింపునకు కుట్ర: అఖిలపక్షం ధ్వజం
- అంబేద్కర్ చౌరస్తాలో భారీ ధర్నా.. కలెక్టరేట్ ఎదుట నిరసన, వినతిపత్రం అందజేత
రైజింగ్ సన్ న్యూస్ , వనపర్తి అక్టోబర్ ౦7 :
దేశ ప్రజాస్వామ్యానికి పునాది అయిన వయోజన ఓటు హక్కును కాలరాసే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని, బీజేపీకి ఓట్లు వేయని వారి ఓట్లను ఫామ్-6 పేరుతో తొలగిస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసి) జ్ఞానేశ్వర్ కుమార్ తీరును ఎండగడుతూ.. ఆయనను ‘అజ్ఞానేశ్వర్’ అని అభివర్ణించారు. సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ను వెంటనే పదవి నుంచి తొలగించి, తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి, అఖిలపక్ష పార్టీల మద్దతుతో వనపర్తి అంబేద్కర్ చౌరస్తాలో భారీ నిరసన, ధర్నా నిర్వహించారు. అనంతరం సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్, బీజేపీ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఓటు హక్కును కాపాడే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు సీఈసీపై చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలంతా గమనిస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు విలువ తెలియని వారు ఎన్నికల వ్యవస్థకు ఎలా నాయకత్వం వహిస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-326 కల్పించిన వయోజన ఓటు హక్కును హరించే హక్కు ఎవరికీ లేదన్నారు.45 వేల ఓట్ల తొలగింపునకు కుట్ర.. నియోజకవర్గంలో సుమారు 2.75 లక్షల ఓట్లు ఉండగా, అందులో 45 వేల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. బతికున్న ప్రజల ఓట్లను, అర్హులైన పేదలు, సామాన్యుల ఓట్లను జాబితా నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఎన్నికల వ్యవస్థలో తెచ్చిన మార్పులను అడ్డం పెట్టుకుని బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
కలెక్టరేట్ ముట్టడి - వినతిపత్రం అందజేత : అంబేద్కర్ చౌరస్తా నుంచి సమీకృత కలెక్టరేట్ వరకు అఖిలపక్ష నాయకులు భారీగా ర్యాలీ నిర్వహించారు. ‘బీజేపీ హటావో.. దేశ్ బచావో’ నినాదాలతో కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికి అఖిలపక్ష నాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి జయరాములు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఖాదర్ బాషా, సీపీఎంఎల్ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్, వివిధ పార్టీల నాయకులు తిరుపతయ్య, రాజేంద్రప్రసాద్, మాధవి రమేష్, బ్రహ్మచారి, కదిరే రాములు, వివిధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
0 Comments