Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

కల్యాణలక్ష్మి పథకం రద్దు కుట్రను అడ్డుకుంటాం - ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భరోసా కల్పించిన పథకాలను కొనసాగించాలి.. ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజం

 కల్యాణలక్ష్మి పథకం రద్దు కుట్రను అడ్డుకుంటాం...

- ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భరోసా కల్పించిన పథకాలను కొనసాగించాలి.. ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజం

వనపర్తి, ఆగస్టు 18 ( రైజింగ్ సన్ న్యూస్): కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. పథకాలను కొనసాగించడంతోపాటు కేసీఆర్‌ కిట్‌, రైతు బీమా పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘కదనభేరి’ పేరుతో రాజీవ్‌ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడంతోపాటు బాల్య వివాహాల నివారణకు దోహదపడ్డాయని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. 2014లో ప్రారంభమైన ఈ పథకాల కింద 2023 వరకు సుమారు 13.50 లక్షల మందికి రూ.14 వేల కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. కరోనా సమయంలోనూ పథకాలను కొనసాగించడంతోపాటు మహిళలకు కేసీఆర్‌ కిట్‌ అందించామని గుర్తుచేశారు.

‘తులం బంగారం’ హామీ ఏమైంది?

కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని, ఆ హామీ అమలుపై మహిళల్లో నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కోర్టు వ్యవహారంలో తగిన విధంగా స్పందించడం లేదని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. పథకం లబ్ధిదారుల సంఖ్య తగ్గిందని పేర్కొంటూ.. 2024–25లో 1.58 లక్షల మందికి, 2025–26లో కేవలం 86 వేల మందికి మాత్రమే ప్రయోజనం అందిందని విమర్శించారు. ఈ గణాంకాలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.

పింఛన్ల హామీలపై నిలదీత

అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా పింఛన్లను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్లను రూ.6 వేలకు పెంచుతామని, ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ హయాంలో పింఛన్లను రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచి లక్షలాది మందికి అందించామని తెలిపారు.

సాగునీటిపైనా విమర్శలు

శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యతను సమర్థంగా వినియోగిస్తే యాసంగి, వానాకాలం పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉందని నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో తెలంగాణ రైతులకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. శ్రీశైలం నీటి వినియోగం, పోతిరెడ్డిపాడు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగిస్తుందని ప్రకటించారు. పోతిరెడ్డిపాడు సందర్శనకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులను ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.

నిరసనలకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, నిరసన వ్యక్తం చేయడం ప్రతిపక్షాల హక్కు అని నిరంజన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమాలకు స్థానిక పోలీసులు అనుమతులు నిరాకరించడం సరికాదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారుల తీరును గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. కేసీఆర్‌ పాలనలో సంక్షేమం, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో విధ్వంసం చోటుచేసుకుంటోందని విమర్శించారు. అన్ని వర్గాల సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీని విమర్శించడంపై చూపుతున్న శ్రద్ధను ప్రజా సమస్యల పరిష్కారంపై చూపాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు.కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌, వాకిటి శ్రీధర్‌, నందిమల్ల అశోక్‌, గంధం పరంజ్యోతి, కె.మాణిక్యం తదితర నాయకులతోపాటు మహిళా సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి