చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి
- పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు
వనపర్తి, ఆగస్టు 18 ( రైజింగ్ సన్ న్యూస్): కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి, తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి పార్టీ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ నెల 16న గోపాల్పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. పార్టీ అధిష్ఠానం కోట్లాది రూపాయలు తీసుకుని తనకు బీఫామ్ ఇచ్చిందనే విధంగా మాట్లాడటం కాంగ్రెస్ను అవమానించడమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులతో కలిసి కల్వకుర్తిలోని మల్లు రవి క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు అందజేశారు.
‘అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తా’
చిన్నారెడ్డిపై ఫిర్యాదు అంశాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని మేఘారెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్లను కలిసి పరిస్థితిని వివరిస్తానని పేర్కొన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగ విమర్శలకు వేదికగా మార్చడం వల్ల కార్యకర్తల్లో అయోమయం నెలకొంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడొద్దు’
కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. వనపర్తిలో చిన్నారెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కుమ్మక్కై పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను చిన్నారెడ్డి వర్గం ఎలా స్పందిస్తుందనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో బీఆర్ఎస్ పాలనలో పార్టీ కోసం పనిచేసిన సమయంలో ఎదురైన ఇబ్బందులను గుర్తుచేసిన వారు.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే మేఘారెడ్డి నాయకత్వంలో కార్యకర్తలకు గౌరవం లభిస్తోందన్నారు. సీనియర్ నాయకులుగా పార్టీ ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారు బహిరంగంగా పరస్పర ఆరోపణలు చేయడం కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారుతోందని పేర్కొన్నారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపి పార్టీ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని మల్లు రవిని కోరారు.
0 Comments