కర్నెతండా లిఫ్ట్.. రెండేళ్లయినా పంపులు ఎందుకు ప్రారంభించలేదు?
- రెండు రోజుల్లో పంపులు ప్రారంభించాలి.. లేకుంటే రైతులతో కలిసి ముట్టడిస్తాం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
రూ.2 కోట్లు మంజూరు చేసినా..
కర్నెతండా లిఫ్ట్ పథకానికి సంబంధించిన సబ్‌స్టేషన్ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలోనే రూ.2 కోట్లు మంజూరు చేశామని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పనుల్లో సుమారు 90 శాతం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన పనులు, ముఖ్యంగా విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటులో జాప్యం వల్ల రైతులకు ప్రయోజనం అందకుండా పోయిందని విమర్శించారు.
వెట్‌రన్ నిర్వహించి.. బంద్ ఎందుకు?
4,500 ఎకరాలకు సాగునీరు
కర్నెతండా ఎత్తిపోతల పథకం ద్వారా ఘణపురం బ్రాంచ్ కెనాల్, బుద్ధారం బ్రాంచ్ కెనాల్ మధ్య ఉన్న ఎత్తైన ప్రాంతంలోని సుమారు 4,500 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యమని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఖిలాఘణపురం మండలంలోని సుమారు 6 గ్రామాలు, 9 గిరిజన తండాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
58 మీటర్ల ఎత్తుకు నీటి ఎత్తిపోత
ఘణపురం బ్రాంచ్ కెనాల్ 7.3 కిలోమీటర్ల వద్ద ఉన్న ముందరి తండా మైసమ్మ చెరువును నింపి.. అక్కడి నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ ద్వారా పంప్‌హౌస్‌కు నీటిని తరలించేలా పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. లిఫ్ట్ నుంచి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలోని డెలివరీ సిస్టర్న్ వరకు నీటిని తరలించేందుకు మొత్తం 58 మీటర్ల ఎత్తును అధిగమించాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకోసం 800 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
2022లో శంకుస్థాపన
ఎత్తైన ప్రాంతాల్లో సాగునీటి వసతి లేని రైతులకు కృష్ణా జలాలను అందించాలనే ఉద్దేశంతో కర్నెతండా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని రూపొందించినట్లు మాజీ మంత్రి తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2022 మార్చి 8న రూ.76.16 కోట్ల అంచనా వ్యయంతో పథకానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు వేగంగా జరిగాయని.. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.
‘అసాధ్యం’ అనుకున్న ప్రాంతానికి నీరు
వనపర్తి నియోజకవర్గంలో ప్రతి చెరువు, కాలువను పరిశీలించి నీటి లభ్యతను అంచనా వేసి ప్రతి ఎకరానికీ సాగునీరు అందించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలు ఎత్తిపోతల పథకాలను చేపట్టిందని నిరంజన్‌రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న గిరిజన రైతులకు కర్నెతండా లిఫ్ట్ ద్వారా నీరు అందించే అవకాశం ఏర్పడిందన్నారు. అసాధ్యమనుకున్న పనిని గత ప్రభుత్వం చేసి చూపించిందని పేర్కొన్నారు.
రెండు రోజుల్లో ప్రారంభించాలి
కృష్ణా వరదలతో ప్రస్తుతం సాగునీరు అందుబాటులో ఉన్నందున ఆలస్యం చేయకుండా కర్నెతండా లిఫ్ట్ పంపులను ప్రారంభించాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో పంపులు ప్రారంభించకపోతే వేలాది మంది రైతులతో కలిసి కర్నెతండా లిఫ్ట్‌ను ముట్టడించి పంపులు ప్రారంభించే వరకు ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రభుత్వ జాప్యంపై ప్రశ్నలు
పథకం కోసం భారీగా నిధులు వెచ్చించినా.. చివరి దశలో విద్యుత్ సదుపాయం, పంపుల నిర్వహణ, నీటి విడుదల వంటి అంశాల్లో జాప్యం ఎందుకు జరుగుతోందనే ప్రశ్నలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. పథకం పూర్తయినట్లు ప్రకటించినా వాస్తవంగా రైతుల పొలాలకు నీరు చేరకపోతే నిర్మాణ వ్యయం ఫలితం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం నీటి లభ్యత ఉన్న సమయంలో పంపులను ప్రారంభించకపోతే ఈ సీజన్లో సాగు అవకాశాన్ని రైతులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాంకేతిక సమస్యలను పరిష్కరించి లిఫ్ట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, నందిమల్ల అశోక్, రాళ్ల కృష్ణయ్య, సామ్యానాయక్, జాతృ నాయక్, పీన్యానాయక్, గోపాల్‌నాయక్, నరేష్‌నాయక్ తదితర వనపర్తి జిల్లా, ఘణపురం మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
0 Comments