Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

నీళ్లున్నాయనొచ్చి వరి వేస్తే.. ఇబ్బందులే

 నీళ్లున్నాయనొచ్చి వరి వేస్తే.. ఇబ్బందులే!

- ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం.. ఆరుతడి, పామాయిల్‌ వైపు మళ్లాలి

- పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి.. నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

 – జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

పెద్దమందడి, ఆగస్టు 12( రైజింగ్ సన్ న్యూస్): ప్రస్తుతానికి నీటి లభ్యత ఉందని తొందరపడి వరి సాగు చేసి.. రానున్న రోజుల్లో ఇబ్బందులు పడొద్దని జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి రైతులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రెండు నెలల్లో వర్షాలు తగ్గే అవకాశం ఉందని, రైతులు పరిస్థితులను అంచనా వేసుకుని ఆరుతడి, పామాయిల్‌, కూరగాయల పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. మంగళవారం పెద్దమందడి రైతువేదికలో నిర్వహించిన ‘రైతునేస్తం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.

76 సెం.మీ. మాత్రమే వర్షపాతం

గతేడాది ఆగస్టు నాటికి పెద్దమందడి మండలంలో 100 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదైందని, ఈ ఏడాది ఇప్పటివరకు 76 సెం.మీ. మాత్రమే నమోదైందని కలెక్టర్‌ తెలిపారు. గతేడాది మండలంలో 22 వేల ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. 18 వేల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు వివరించారు. ఈ ఏడాది వరి సాగుకు సరిపడా నీరు అందే పరిస్థితి ఉండకపోవచ్చని, భూగర్భజలాలు కూడా గణనీయంగా తగ్గుతున్నాయని పేర్కొన్నారు.

ఆరుతడి పంటలపై దృష్టి

రైతులు వేరుశనగ, మినుములు, కూరగాయలు వంటి ఆరుతడి పంటలతో పాటు పామాయిల్‌ సాగు చేపట్టి ఇతర మండలాలకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ కోరారు. ఆరుతడి పంటలకు అవసరమైన మేలురకం, లాభదాయకమైన విత్తనాలను అందించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు.

పామాయిల్‌తో అధిక లాభాలు

జిల్లా ఉద్యానవన శాఖ అధికారి విజయభాస్కర్‌ మాట్లాడుతూ పామాయిల్‌ సాగును ప్రభుత్వం అధిక సబ్సిడీతో ప్రోత్సహిస్తోందన్నారు. వరి సాగుకు ఒక ఎకరాకు వినియోగించే నీటితో పామాయిల్‌ను మూడు ఎకరాల్లో సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఎకరాకు ఐదు నుంచి ఏడు టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికే పామాయిల్‌ సాగు చేస్తున్న కొందరు రైతులు మంచి ఆదాయం పొందుతున్నారని వివరించారు. కూరగాయల సాగుకు ప్రభుత్వం ఎకరానికి రూ.9,600 సబ్సిడీ అందిస్తోందని, రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వరికే బోనస్‌ ఇస్తే..?

రైతు వెంకటరెడ్డి మాట్లాడుతూ గతంలో జిల్లాలో ఆరుతడి పంటలే అధికంగా సాగు చేసేవారని, సాగునీటి లభ్యత పెరగడంతో రైతులు వరి సాగుకు అలవాటు పడ్డారని తెలిపారు. వరికి గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వం బోనస్‌ కూడా ఇస్తున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. ఆరుతడి పంటలకు నాణ్యమైన విత్తనాలు అందించడంతో పాటు వాటికీ బోనస్‌ ప్రకటించాలని కోరారు. నాణ్యమైన వేరుశనగ విత్తనాలు అందిస్తే రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గుచూపుతారని తెలిపారు.

పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచాలి

అనంతరం పెద్దమందడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. పీహెచ్‌సీలకు అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది అందుబాటులో ఉన్నందున ఇక్కడ ప్రసవాల సంఖ్య పెంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. గర్భిణులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి ప్రతి గర్భిణికి తప్పనిసరిగా రక్తహీనత పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి

హీమోగ్లోబిన్‌ స్థాయిలు తక్కువగా ఉన్న గర్భిణులకు అవసరమైన మందులు, పోషకాహారంపై అవగాహన కల్పించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. లేబర్‌ రూమ్‌ను పరిశీలించి ప్రసవాలకు వచ్చే గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వసతులు సిద్ధంగా ఉంచాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, జ్వరం, జలుబు, ఒంటినొప్పులతో వచ్చే రోగులకు తప్పనిసరిగా రక్త పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సాయినాథ్‌రెడ్డి, ప్రోగ్రాం అధికారి పరిమళ, మెడికల్‌ ఆఫీసర్‌, తహసీల్దార్‌ మల్లికార్జున్‌, ఎంపీడీవో పర్ణిత, మండల వ్యవసాయ అధికారి సైదులు, సర్పంచి సూర్యగంగమ్మ, సింగిల్‌విండో చైర్మన్‌ సత్యారెడ్డి, రైతులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి