వనపర్తిలో హిందూ శ్మశాన వాటిక సమస్యలను పరిష్కరించాలి:
మున్సిపల్ ఛైర్మన్కు వినతి
వనపర్తి, ఆగస్టు 17 ( రైజింగ్ సన్ న్యూస్): వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని హిందూ శ్మశాన వాటికలో నెలకొన్న తీవ్ర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చు రాము మున్సిపల్ ఛైర్మన్ మిడిదొడ్డి మాధవీలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వనపర్తి పట్టణం ఏర్పడి సుమారు 300 సంవత్సరాలు అవుతున్నప్పటికీ, నేటికీ హిందూ శ్మశాన వాటిక లేకపోవడం బాధాకరమన్నారు. దీనివల్ల హిందువుల దహన సంస్కారాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించే వారు 20 వేలకు పైగా డిమాండ్ చేస్తుండటంతో మధ్యతరగతి, పేద ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన సమస్యలు:
అధ్వాన్న వసతులు: శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలైన నీటివసతి, మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకోవడానికి గదులు లేవు.
పనిముట్ల కొరత: దహన సంస్కారాలకు ఉపయోగించే పనిముట్లు సరిగ్గా లేకపోవడం, ఇనుప దిమ్మె ఎక్కువ ఎత్తు మరియు విస్తీర్ణంలో ఉండి నిరుపయోగంగా మారడంతో దహన కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
స్థల అభావం: పాత శ్మశాన వాటికలో స్థలం చాలక, ఖననం కోసం త్రవ్వుతున్న సమయంలో గతంలో ఖననం చేసిన పుత్రులు (శవాలు) బయటపడుతున్నాయి.
భూముల ధరల పెరుగుదల: చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రైవేట్ స్థలాల్లో దహన సంస్కారాలు చేయడానికి అనుమతించడం లేదు.
ముఖ్యమైన డిమాండ్లు:
వెంటనే వనపర్తి పట్టణంలో విద్యుత్తు దహన యంత్రాన్ని ఏర్పాటు చేయాలి.
జనాభాకు అనుగుణంగా తగిన స్థలాన్ని కేటాయించి, నూతనంగా శ్మశాన వాటికను ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలి.
మున్సిపల్ కార్మికులను శ్మశాన వాటికలో ఇద్దరిని నియమించి, వారికి సంబంధించిన వేతనం/అమౌంట్ను మున్సిపాలిటీ ద్వారా ఫిక్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదివరకే జిల్లా, మున్సిపల్ అధికారులు మరియు శాసనసభ్యుల దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లినా నేటికీ పరిష్కారం కాలేదని, ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఆర్యవైశ్య సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి ఎలిసెట్టి వెంకటేష్ కోశాధికారి ఏపూరి శ్రీనివాసులు పట్టణ వనపర్తి ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు మారం బాలీశ్వరయ్య లెగిశెట్టి అశోక్ దాచే శివ యువజన సంఘం అధ్యక్షుడు బచ్చు వెంకటేశు వర్తక సంఘం అధ్యక్షుడు పాలాది సుమన్ చుక్కయ్య మారం గోవిందు కొండూరు ప్రవీణ్ భూపేష్ రఘు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు
.jpeg)
0 Comments