జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం విస్మరించింది
ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, రైల్వే పాసులు పునరుద్ధరించాలి: టిడబ్ల్యూజేఎఫ్ డిమాండ్
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) వనపర్తి జిల్లా అధ్యక్షుడు జూటూరు రాము విమర్శించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, రైల్వే పాస్లు కల్పించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం వనపర్తి కలెక్టరేట్ ఎదుట టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్. ఖీమ్యా నాయక్కు అందజేశారు.ఈ సందర్భంగా జూటూరు రాము మాట్లాడుతూ, ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు నేటికీ కనీస భద్రత, సంక్షేమం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో పారదర్శకత లేదని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల్లో అన్ని జర్నలిస్టు సంఘాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ప్రమాద బీమా అమలు చేయాలని, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు. కరోనా సమయంలో నిలిచిపోయిన రైల్వే పాస్లను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఉచిత ఆర్టీసీ బస్సు పాస్లు, మెట్రో నగరాల్లో మెట్రో పాస్లు కూడా అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.టిడబ్ల్యూజేఎఫ్ జాతీయ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి. రమేష్, పి. స్వామి, సురవరం ప్రతాపరెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బి. రమేష్ మాట్లాడుతూ, జర్నలిస్టుల సామాజిక భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. గతంలో కేటాయించిన ఇళ్ల స్థలాల అంశాన్ని పరిష్కరించి అర్హులైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.వినతిపత్రాన్ని స్వీకరించిన అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్, టిడబ్ల్యూజేఎఫ్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జాతీయ కమిటీ సభ్యుడు పూరి సురేష్ శెట్టి, జిల్లా కమిటీ సభ్యులు ఏ. అశోక్, బి. బాబు, రాము రాథోడ్, జర్నలిస్టులు బాల్య నాయక్, అజీమ్, మన్నాజీ, దినేష్, ఖలీల్, అంజి, విజయ్ కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments