ప్రజాస్వామ్యంపై దాడులను సహించం...
- ఓట్ల తొలగింపుపై సీపీఐ ఆగ్రహం.. జంతర్ మంతర్ ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాలని డిమాండ్
రైజింగ్ సన్ న్యూస్, వనపర్తి, అక్టోబర్ 13: ప్రజాస్వామ్య హక్కులను హరించే చర్యలను సహించబోమని, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని సీపీఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్ హెచ్చరించారు. అర్హుల ఓట్ల తొలగింపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా చౌక్ ఎత్తివేతకు నిరసనగా వనపర్తి అంబేడ్కర్ చౌక్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్నవారితోపాటు దళితులు, ముస్లింలు, క్రైస్తవుల ఓట్లను తొలగించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే 13 కోట్ల ఓట్లు తొలగించారన్న వారు, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, లేనిపక్షంలో తొలగించాలని డిమాండ్ చేశారు.దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలకు వేదికగా ఉన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా చౌక్‌ను ఎత్తివేయడం ప్రజాస్వామ్య నిరసనలపై ఆంక్షలు విధించడమేనని విమర్శించారు. అక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువకులపై పోలీసుల ముసుగులో బీజేపీ కార్యకర్తలతో దాడులు చేయించారని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ఉద్యమాలను అణచివేయలేరని స్పష్టం చేశారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌ను ఎత్తివేసినప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైందని గుర్తుచేశారు. తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాలు నిరసన వేదికలను తొలగించడం ద్వారా అప్రజాస్వామిక ధోరణిని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. అణచివేత చర్యలు ప్రజా ఉద్యమాలను ఆపలేవని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. జంతర్ మంతర్ ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాలని, విద్యార్థులు, యువకులపై దాడులకు పాల్పడినవారిని అరెస్టు చేయాలని, ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు చైతన్యవంతులై ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్, కేతేపల్లి ఉప సర్పంచి కృష్ణవేణి, నాయకులు పృథ్వీనాదం, ఎత్తం శివ, శేఖర్, చిన్న కురుమన్న, లక్ష్మీనారాయణ, జయమ్మ, మహేష్, విష్ణు, కుతుబ్, సురేష్, వంశీ, జ్యోతి, వెంకటమ్మ, కవీందర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments