ఘనపురం ఖిల్లా ట్రెకింగ్తో పర్యాటక శోభ.. రూ. 2 కోట్లతో అభివృద్ధి: ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
రైజింగ్ సన్ న్యూస్ వనపర్తి, సెప్టెంబర్ 27:ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లాలో పర్యాటక శోభ సంతరించుకుంది. చారిత్రక ప్రాంతాలను ప్రజలకు పరిచయం చేసే లక్ష్యంతో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఖిల్లాఘణపురం మండలంలోని చారిత్రక ఘనపురం ఖిల్లా వద్ద ఘనంగా ట్రెకింగ్ నిర్వహించారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులతో కలిసి కోటను సందర్శించి దాని చారిత్రక విశేషాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ.. ఘనపురం ఖిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చించి, ఈ కోట అభివృద్ధికి రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టామని, త్వరలోనే ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) రానున్నాయని వెల్లడించారు. కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులు, సుమారు 80 ఏళ్ల క్రితం సరళాసాగర్లో ఏర్పాటు చేసిన సైఫన్ విధానం అప్పటి ఇంజినీరింగ్ నైపుణ్యానికి అద్దం పడుతున్నాయని కొనియాడారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాలగా ఉన్న చారిత్రక రాజమహల్ భవనాన్ని కూడా పునరుద్ధరిస్తామన్నారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, కాస్మెటిక్ ఛార్జీలు, భోజన ఖర్చుల కేటాయింపులను పెంచినట్లు తెలిపారు. త్వరలోనే విద్యార్థులకు అవసరమైన అన్ని సామగ్రితో కూడిన కిట్లను అందజేస్తామని చెప్పారు.
చరిత్రపై అవగాహన పెరగాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో అద్భుతమైన చారిత్రక, ప్రకృతి సిద్ధమైన పర్యాటక ప్రదేశాలున్నాయని తెలిపారు. విద్యార్థులు, యువతకు మన చరిత్ర, సంస్కృతిపై అవగాహన కల్పించేందుకే ఈ ట్రెకింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ముందుగా మనం మన ప్రాంత విశేషాలను తెలుసుకొని, వాటిని ఇతరులకు కూడా పరిచయం చేయాలని పిలుపునిచ్చారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి చేతుల మీదుగా బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్, డీవైఎస్ఓ సుధీర్ రెడ్డి, సీపీఓ హరికృష్ణ, నాయకులు సాయి చరణ్ రెడ్డి, ఆగారం ప్రకాష్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



1 Comments
Super
ReplyDelete