పరారైన పోక్సో కేసు రిమాండ్ ఖైదీ..
పట్టుకునేందుకు వెళ్లగా ఆత్మహత్యాయత్నం
మహబూబ్నగర్ అర్బన్, జూలై :మహబూబ్నగర్ జిల్లా కేంద్ర జైలులో రిమాండ్లో ఉన్న పోక్సో కేసు నిందితుడు కిషోర్ కుమార్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున జైలు నుంచి పరారైన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.అధికారుల సమాచారం ప్రకారం, ఆత్మకూరు మండలంలో నమోదైన పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కిషోర్ కుమార్ రెడ్డి తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో టవళ్లను తాడులా తయారు చేసి జైలు ప్రహరీ గోడ దూకి పరారైనట్లు తెలుస్తోంది.జైలు నుంచి తప్పించుకున్న అనంతరం అతడు తన స్వగ్రామమైన నందిమల్ల గ్రామంలోని సొంత వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, జైలు అధికారులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో కిషోర్ కుమార్ రెడ్డి నానో యూరియా లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని వెంటనే వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై జైలు శాఖ ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. జిల్లా జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరారైన ఘటనపై భద్రతా లోపాల అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
0 Comments